'సత్యం వద' అని అభ్యసించిన తరుణమది
'ధర్మం చర' అని అనుసరించ తలచిన సమయమది
సేవయె త్రొవై జీవించ నిశ్చయించితిమి
సేవయె త్రొవై జీవించ నిశ్చయించితిమి
కపటమెరుగని మనస్సు, కల్లలాడని గుణములే కలిమియై మెలుగుచుంటిమి
శైశవము గడచి పోయెను, యవ్వనము తరలి పోయెను
మొలకెత్తిన మొక్క మానవ్వకనే మోడాయెను
జంకక బొంకులాడుట నేర్పెను కాలము అని
తప్పును ఒప్పు చేసెను తెలియని జాలము అని
పలికితిమి నాడు నేర్చిన సూక్తులను విస్మరించి
మార్చి వేసినది కాలము మమ్మని నిట్టూర్చి మనలను మనమే వంచించు కొంటిమి
చెడు నేర్చినది మనమని ఒప్పుకొనక చేతులు ముడుచు కొంటిమి
నింద కాలపు పోకడ పై నెట్టిన, తప్ప్పు మనది కాక పోగలదా?
అవధి లేక అధిగమించు ఆగడములు ఆగగలవా?

No comments:
Post a Comment