Sunday, February 17, 2008

స్వేఛ్ఛ

అస్తమించెడి సూర్యుడు దారి తీసెను నెలవంకకు
చేరువవ్వని చిలుక చేకూర్చెను కలవరమును గోరింకకు
నిరీక్షించి అలసి, గుండెలోని గుబులు తోటి
నేస్తపు ధ్యాసయె శ్వాసయై వెతుక బయలుదేరెను
కానవచ్చెను నీరసించి శుష్కించి జీవఛ్ఛవముగ నున్న
కీరము స్వేఛ్ఛ కోల్పోయి పంజరమున
వికలమైనవి విహంగములు,వాటిల్లినది విషమ స్థితి
పసిడి పంజరమైననూ,అందున్నది పంచామృతమైననూ
దానవానందము పాలై పరుల వశమైన స్వేఛ్ఛతో సరి తూగలేవు కదా!

ఏఱై పారు కన్నీరు

ఎటు చూచిన రోధించు కనులు, క్షోభించు మనస్సు
శోకించు మోము, యాచించు కరములు
చేతికందని పదవి కై ధనికుని పోరు
పెదవికందని మెతుకు కై దరిద్రుని హోరు
మేడలు ,అంతస్తులకై మదనపడు మధ్యతరగతివాడు
వాణిజ్యమందు వరహాల వర్షము కై వేడెడి వర్తకుడు
ఎటు చూచిన రోధించు కనులు, క్షోభించు మనస్సు
శోకించు మోము, యాచించు కరములు
నేత్రములు అమర్చ మరచి, శ్రవణ లోపమును జత పరచి
స్వరపేటికనిడక,ఇంద్రియాధీనమును ఇవ్వక
పంపివేసెను ప్రజాపతి, ఉర్వికి కొందరభాగ్యులను
వ్యసన పడక, ఆనంద డోలలూగుచుండెదరు వారు తమ ఊహాలోకమందు
పాల్గొనక, బాహ్యలోకపు మానవుల అక్కరకు రాని పరుగు పందెమందు
క్లేశమొందుటకు కోకొల్లలైన కారణములున్నను
వేదనను వెల్లఢించని,విరబూసెడి వీరి వదనములు వీక్షించినా
కృతఙ్ఞతతో కైదండలిడమేల కొరత పెట్టనందుకు?
కలుగదేల మనకు కనువిప్పు?
నిలువవేల కాంక్ష చావని అశ్రు ధారలు?

Friday, February 15, 2008

ప్రేమ

ఎదురు ఆశించనిది పంచిన తరగక పెరుగునది
ఆంధ్రము కన్న మధురమైనది నిర్వచింప తరమగనిది
చవి చూచిన విడువ లేనిది కవి కందని భావన ఇది
రవిని భువి చుట్టు తుది క్షణము వరకు క్షయించనిది
అనుదినము కొనియాడ తగిన మహత్కరమైన అనుభూతికి
ఒక్క దినము నిర్దేశించుట భావ్యమా?

Wednesday, February 13, 2008

కాలం

చిన్నతనమున మనము
'సత్యం వద' అని అభ్యసించిన తరుణమది
'ధర్మం చర' అని అనుసరించ తలచిన సమయమది
సేవయె త్రొవై జీవించ నిశ్చయించితిమి
కపటమెరుగని మనస్సు, కల్లలాడని గుణములే కలిమియై మెలుగుచుంటిమి
శైశవము గడచి పోయెను, యవ్వనము తరలి పోయెను
మొలకెత్తిన మొక్క మానవ్వకనే మోడాయెను
జంకక బొంకులాడుట నేర్పెను కాలము అని
తప్పును ఒప్పు చేసెను తెలియని జాలము అని
పలికితిమి నాడు నేర్చిన సూక్తులను విస్మరించి
మార్చి వేసినది కాలము మమ్మని నిట్టూర్చి మనలను మనమే వంచించు కొంటిమి
చెడు నేర్చినది మనమని ఒప్పుకొనక చేతులు ముడుచు కొంటిమి
నింద కాలపు పోకడ పై నెట్టిన, తప్ప్పు మనది కాక పోగలదా?
అవధి లేక అధిగమించు ఆగడములు ఆగగలవా?

Tuesday, February 12, 2008

పొగల వగలు

నాడు మగని మీసపు చాటున రగులుచుండెడి చిరు చిచ్చు
నేడు మగువ అధరమును అధిష్ఠించిన విడ్డూరమును కానవచ్చు
పొగ పీల్చుట యందు ఎట్టి మేలెంచిరో
చుట్ట కాల్చుట యందు ఏ సుఖము గాంచిరో
పొగ త్రాగని వాని ధూషించిన గురజాడ పద్యము స్ఫూర్తినిచ్చెనో
పగవాని పనిపట్టిన నవాబుల హుక్కా ఙ్ఞప్తికి వచ్చెనో
వ్యసనమాయె వీరికి ధూమపానము
ఇక్కట్ల పాలాయె ఊరక వీరి ప్రాణము
చుట్టల కట్టలు కట్టి పెట్టి “గట్టి మేల్ తలపెట్టవోయ్”
అను ఆ అమరుని మాటకై పాటు పడరోయ్
భూతలమును స్వచ్ఛ సీమగ మార్చుటకు నడుం కట్టరోయ్!
పైన చెప్పిన గురజడ గారి పద్యము ఇది
కం. ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలె
న్పొగచెట్టై జన్మించెను
పొగత్రాగని వాడు దున్నపోతై బుట్టున్.

గతము-మధురము

మరల మరలి రావు మరపురాని ఆ మధుర క్షణములు
మిన్ను మన్నైనను లేవిక నిన్న మొన్న వంటి దినములు
గతం మిగిల్చిన ఙ్ఞాపకాల ఆనుభూతి
ఇవ్వదు ఎందుకు ఈ స్థితి
ఇది పురోగాతా లేక అధోగతా?
ఆట పాటలకు కేరింతలకు లేకుండెను నాడు లోటు
వాటిని దూరం చేసెను యాంత్రిక జీవితము వంటి నేటి పాటు
ఎవరు ఎరుగుదురు ఈ పాకులాటకు గల ఆంతరార్థం
ఎరుక ఆ సూత్రధారికే ఈ బొమ్మలాటకు గల పరమార్థం!

Tuesday, February 5, 2008

నగరమా? నరకమా?

మేఘుని ఝరి తాళక పట్టెదరు ఛత్రమును
అర్కుని సెగనోర్వక వెతికెదరు సేద తీర్చు సత్రమును
వాహనముల పొగనోర్వక కట్టెదరు రూమాళ్ళను
నిశియైన పగలైన విసుగు చెందిన నగరవాసులు
లేదు వీరికి శ్వాస నిశ్వాసల భాగ్యం
నిర్మలముగ నిట్టూరుపైన నింపలేని ఈ అభాగ్యం
ఇవ్విధముగ విష వాయువుల నడుమ సంచరించుట కన్న
విషనాగుని గరళమారగించుట సరళము

Friday, February 1, 2008

రంగుల హంగు

కొమ్మనున్న కోయిలమ్మ
కొలనినున్నకొంగను కని
విధాత విధించిన వన్నెను
వదిలించుకొన వ్రతము బూని
తడి సుద్ద యందు పొర్లిన,
ఎన్నాళ్ళు నిలుచునా బొంకు వర్ణము?
సుమసమానులారా, సుమతులారా
ఒక్క పూటైన నిల్వని పూతలెందుకు?
సహజత్వమును మించు సోయగము గలదే!