Friday, May 9, 2008

ఉస్సురుమనిపించు బస్సు

ఉదయ రాగము సైరను ఆలపించింది
ఉరుకులకు సమయము సమీపించింది
ఉరిమెడి గడియారము ఉలుకు నిచ్చింది
ఉడికిన నీరు కాసింత ఉత్సాహమునిచ్చింది
ఉడకని ఇడ్డెన కాస్త దానిని అణచి వేసింది
ఊహల నడుమ ఊగిసలాడుతూ ఆలస్యమయ్యింది
ఉండెను వేచి నాకై ముందు ఓ ఇబ్బంది
ఊగుచూ వాయువేగమన బస్సు వచ్చింది
ఉప్పెన వచ్చినంత పని అయ్యింది
ఉవిదలు ముందు, పురుషులు వెనుక
ఊనిక అందక, ఉసిరంత చోటు అగుపడలేదు ఎక్కుటకు
ఉపాయము వేరొకటి తోచక ఎక్కితిని ఇక్కట్లు పడి
ఊరక ఊసులాడు వారు ఇచ్చట
ఉచిత సలహాలతో ఉసి గొల్పెడి వారు అచ్చట
ఊర్మిళను ఓడించువారు నిదరోతూ ఇక్కడ
ఊర్వశి వంటి ఒప్పుల కుప్పలు అక్కడ
ఉన్నట్టుండి డ్రైవరు వేసెను బ్రేకు
ఊడిపడిరి అమాంతముగ నా వెనకున్న జనము
ఉడుం పట్టు పట్టకున్న నడుం విరుగునని
ఊతనందుకొంటి గొప్ప యత్నము పిదప
ఉక్క వలన ఊపిరాడక పొయె
ఊక్కు వలన ఉడుకు అధికమాయె
ఉదకమైన లెకపొయె గొంతు తడుపుకొనుటకు
ఉసురు లేచి వచ్చె బయట పడిన క్షణము
ఉదయాన్నే అలా,
ఉస్సురుమనిపించె బస్సు కస్సు బుస్సులాడుతూ

1 comment:

Anonymous said...

please give a jist of each poem in english so that non telugu readers can also appreciate the contents
-ramya